దళితబంధు నిధులివ్వాలని ధర్నా

దళితబంధు నిధులివ్వాలని ధర్నా
  •     హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  •     అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు పోలీసుల యత్నం
  •     తోపులాటలో అస్వస్థతకు గురైన కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : దళితబంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని, అకౌంట్లపై పెట్టిన ఫ్రీజింగ్‌‌‌‌‌‌‌‌ను ఎత్తివేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి శనివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దళితబంధు అప్లికేషన్ల స్వీకరణ పేరిట కార్యకర్తలు, ప్రజలను సమీకరించిన ఆయన.. ఒక్కసారిగా అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ చౌరస్తాకు చేరుకొని ధర్నాకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

దళితబంధు అప్లికేషన్ల పేరిట జనసమీకరణ

దళితబంధు రెండో విడత రాని వారు శనివారం హుజురాబాద్‌‌‌‌‌‌‌‌లోని తన ఇంటికి వచ్చి అప్లికేషన్లు ఇవ్వాలని ఎమ్మె్ల్యే కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం చేశారు. దీంతో కార్యకర్తలతో పాటు దళితబంధు రాని వారు పెద్దసంఖ్యలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇంట్లో నుంచి బయటకి వస్తున్న కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా అందరితో కలిసి అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ చౌరస్తాకు బయలుదేరారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం డప్పుకొడుతూ అప్పటికప్పుడు ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు ఎంత వారించినా పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, హుజురాబాద్‌‌‌‌‌‌‌‌, జమ్మికుంట సీఐలు తిరుమల్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, వరగంటి రవి వచ్చి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డిని వెహికల్‌‌‌‌‌‌‌‌లో ఎక్కించిన తర్వాత తనకు ఊపిరి ఆడడం లేదంటూ చెప్పడంతో ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌ రావు హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యేను పరామర్శించారు. అనంతరం ఆయనను కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తరలించారు. ధర్నాలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హుజురాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ గందె రాధిక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, మొలుగు సృజన, పూర్ణచందర్, మారెపల్లి సుశీల పాల్గొన్నారు.